Telangana Media
రాష్ట్ర సరిహద్దుల సంగతి తర్వాత, మనో వీధుల్లో ఆమడ ఎత్తైన అడ్డు గోడలు లేచాక ఎలా కూల్చగలం? ఆంధ్రా హోటల్ యజమాని, తెలంగాణ రిక్షా కార్మికుడు, ప్రకాశం మేస్త్రీ, పాలమూరు కూలీ, శ్రీకాకుళం వాచ్‌మన్, మంథని పాకయాజి, వరంగల్ ట్యాక్సీ డ్రైవర్, బెజవాడ బాల కార్మికుడు… పేరేదైతేనేం? ఉండే ఊరేదైతేనేం? మనం మనుషులం కదా!
కార్డులు కనిపించ లేదు. కానీ గ్రీటింగులకు కొదవ లేదు. మాంద్యం ముగియలేదు. కానీ మద్యం పొంగు తగ్గలేదు. అనుమానాలు తొలగలేదు. కానీ అభినందనలు ఆగలేదు. సంక్షిప్త సందేశాలు ఆకాశ వీధుల్లో ప్రవహించాయి. ఫోన్ కాల్స్ తో రింగ్ టోన్స్ రవళించాయి. వెల్‌కమ్ టు న్యూ ఇయర్ అంటూ ఇంటి ముందు రంగవల్లులు కొలువు తీరాయి. చీర్స్, విషెస్, కేక్స్… అన్నీ ఉన్నాయి.
చాలాచాలా ఉన్నాయి! కానీ…?! ఏదో వెలితి. తప్ప ని పండగ వచ్చింది కనుక తప్పనిసరై సందడి చేయాలన్న మానసిక బలవంతం! అందుకే ఎంత తాగినా కిక్ పూర్తిగా ఎక్కదే! ఎంత ఎగి రినా మూడ్ అంతగా కుదరదే! ఆ జోష్ మాయమైపోయిందే! కార ణం? కాల చక్రంతో వచ్చిన నూతన పర్వం మాటున నీడలా కదులు తున్న యుద్ధస్వరాల ధ్వని.
పరామర్శిస్తున్న ఆత్మీయ స్పర్శల వెనక సడలుతున్న బంధాల అనుబంధం! మారని మనుషుల మారిన మన సుల మాటల్లోని లోతులను పసిగట్టలేని పసిపిల్ల వాళ్లెవరు? అరేయ్! ‘మన’ వాళ్లకే విషెస్ చెప్పాలి. వాళ్లు… ‘వాళ్లు’…! రోడ్డు మీద కాని స్టేబుల్‌ని చూస్తే ఆక్షేపణలు, అభ్యంత రాలు! ‘అన్నా’ అని అప్యాయంగా పిలిచే పక్కింటి కనకదుర్గ ఈసారి కాస్త ప్రత్యేకంగా చూస్తూ పలకరించింది.
‘కిట్టన్నా’ అని పిలి చే నా మిత్రుడు అన్య మనస్కంగానే ‘ఐ విష్ యూ’ అన్నాడు. అర్ధరాత్రి దాటేదాకా నగ రం నైట్ పార్టీ చేసుకున్న మాట ఎంత నిజ మో, దాని ఆత్మ భయంభయంగా ఆపార్ట్ మెంట్ ఇరుకు గదిలోనే ముడుచుకు కూర్చు న్న మాటా అంతే నిజం! ఉత్సవపు ఉత్సాహ పు ఊపిరికి బదులు నగరంలో వేడి నిట్టూ ర్పుల వేర్పాటు వాదం వినిపించింది.
ఆ మాటకొస్తే అర్ధరాత్రి ఉద్వేగాలు ఊరేగింపు గా సాగినట్టు అనిపించింది. విభిన్న మార్గా ల్లో విరుద్ధ ఆకాంక్షలు! ఉడుకు నెత్తురు పొర్లే కళ్లే ఇప్పుడు చలి మంటల నెగళ్లు! నిన్నటి సహచరులు నేడు వాద విరోధులు. నోటి వెంట మాటలు కాదు, తూటాలే! వాదం వెంట వివాదమే! ఆనందం వెనక కనిపించని భయం! నేపథ్యం నెల రోజులే కావచ్చు.
చరిత్ర అనేక ఏళ్లది ఉండవచ్చు. కానీ ఎవడు దోషి? ఎవడు విద్వేషి? ఎవడు బాధితుడు? ఎవడు బాధ్యుడు? పరంపరగా ప్రశ్నలు! గొర్రెల మందలో నిన్నొకడిగా మార్చి, ఉద్వేగాల గ్రాసాన్ని ఊరించేలా ఉట్టికి కట్టి, ఉసిగొల్పుతూ తమాషా చూస్తున్న దోషి ఎవడు? శత్రువు మనలో లేడు. మనసు లోనూ లేడు. శత్రువు నిన్ను వాడుకోవాలని చూస్తున్న రాజకీయంలో ఉన్నడు.
స్వ-భావమే స్వభావమైపోయిన కొందరిలో ఉన్నడు. పర-వశమైన వాటినన్నిం టినీ తన వశం చేసుకున్న పరవశిస్తూ ఉన్నవారిలో ఉన్నడు. ఉనికి కోసం ఒకడు, రాజకీయ ఊపిరి కోసం మరొకడు, ఓటు కోసం ఒక డు, సీటు కోసం ఇంకొకడు, వాటా కోసం ఒకడు, వేట కోసం వేరొక డు! విషపు నవ్వులతో, విచ్చు కత్తులతో! పూనకం పట్టి శివాలూగడం సులువే! కానీ మిత్రమా? మత్తులోంచి, మాయలోంచి, మాస్ హిస్టీరియాలోంచి బయటకు రా! భౌగోళిక సరిహద్దుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది.
భావోద్వేగాల హద్దుల గురించి! రాష్ట్ర సరిహద్దుల సంగతి తర్వాత, మనో వీధుల్లో ఆమడ ఎత్తైన అడ్డు గోడలు లేచాక ఎలా కూల్చగలం? ఆంధ్రా హోటల్ యజమాని, తెలంగాణ రిక్షా కార్మికుడు, ప్రకాశం మేస్త్రీ, పాలమూరు కూలీ, శ్రీకాకుళం వాచ్‌మన్, మంథని పాకయాజి, వరంగల్ ట్యాక్సీ డ్రైవర్, బెజవాడ బాల కార్మికుడు… పేరేదైతేనేం? ఉండే ఊరేదైతేనేం? మనం మనుషులం కదా! అప్పుడే పరిహారాల గురించి ప్రశ్నిస్తున్న నాయకులారా? మీ వల్ల తల్లడిల్లుతున్న కోట్లాది హృదయాల ఆవేదనకు ఖరీదు కట్టే షరాబు మీలో ఉన్నాడా? రాష్ట్రం వచ్చినా, రాకున్నా సమ న్యాయం సాధిస్తామని మాట ఇచ్చే మంచోడు మీలో ఉన్నాడా? మాట తప్పితే ఆమరణ దీక్ష చేసి ఆత్మార్పణ చేసే వీరు డున్నాడా? మిత్రమా! జాగ్రత్త. నిప్పు లాంటి నిజాలను ఆవేశపు నివురుతో కమ్మేశారు. అక్షరాలను పరిమితుల పరామితులు ఆజ్ఞాపిస్తున్నాయి.
మన జ్ఞాన నేత్రాన్ని టీవీ కెమెరా కన్ను కేటరాక్ట్‌లా కప్పుకుంది. మూసీని మించిన మురికిని మనసులో పెట్టుకున్న నాయకులు ముందుకొస్తున్నారు. మన భాగ్య నగరాన్ని, అందమైన తోటలను, మంచి నీటి చెరువులను సర్వ ధ్వంసం చేసిన నాయకులు, స్వార్థం కోసం మళ్లీ ముందుకొస్తున్నారు. వాళ్ల రంగులు వేరే… కానీ అంతరంగం ఒకటే! మిత్రమా… వార్తలు కాదు; వాటి వెనక వాస్తవాలు చూడు! వాళ్లవల్లే అందమైన నా రాజధాని నగరం ఇప్పుడు… రాశీ భూతమైన రాజకీయ రాక్షస గణాల రక్త కేళికి రంగ భూమిలా మారుతున్న ట్టు అనిపిస్తున్నది. అది అను మానాల అగ్ని పర్వతం మీద ఆపి ఉంచిన అణు బాంబులా కనిపిస్తున్నది. బతుకు తుపాను తీరంలో అల్లల్లాడుతూ భయపడు తున్న కొబ్బరి చెట్టును మరిపిస్తున్నది.
సీమ చివర్లలో తవ్విన ఖ’నిజాల’ బొందలగడ్డను తలపిస్తున్నది. గుడ్డి దీపపు వెలుగులో, గుండె గుడిసెలో గుడగుడమని గుబులు పడుతున్న నేస్తంలా ఉన్నది. అప్పుడే, అంత కుముందే పీనుగ లేచి వెళ్లిన ఇంటిలా, నిశ్శబ్దంగా నిర్వేదంగా, నిర్వికారంగా కనిపిస్తున్నది నా నగరం! వచ్చే న్యూఇయర్ వేడుక ఇక్కడనే చేసుకుంటామా? ఒక మిత్రుడి సందేహం! న్యూ ఇయర్ కేక్‌లాగే రాష్ట్రం ఎన్ని ముక్కలవుతుందో! మరో మిత్రుడి వ్యంగ్యం.
నిజమే.. విభజన ఎప్పుడూ విషాదకరమే. ఉన్న ఊరు వదలి వెళ్లడం వ్యథా భరితమే. పరాయి భావనతో బతకడం బాధాకరమే. అయినా ఎవరన్నారు నిన్ను వెళ్లి పొమ్మని? అనేక జాతుల, అనేక మతాల, అనేక కులాల, అనేక వర్గాల, అనేక ప్రాంతాల, అనేక హోదాల, అందమైన అనుబంధాల సంగమ స్థలి ఈ భాగ్య నగరంలో నువ్వూ నేనూ ఒక కొమ్మకు పూచిన పువ్వులం. ఒక చేతిలో ఒదిగిన రేఖలం. ఒకే ప్రవాహపు పాయలం. మనం రాజకీయ నాయకులం కాదు. మనుషులం, మామూలు మనుషులం!
-తిగుళ్ల కృష్ణమూర్తి